ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeతెలంగాణఆగస్టు 4న చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల సదస్సు

ఆగస్టు 4న చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల సదస్సు

📰 Generate e-Paper Clip

– చిట్యాల లో కరపత్రాల ఆవిష్కరణ

– క్యాష్ క్రెడిట్ రుణమాఫీ చేయాలి

– చేనేత సంఘాల బలోపేతానికి కృషి చేయాలి

– ఏకగ్రీవ సంఘాలకు గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్

చిట్యాల (సంచలనం న్యూస్):
ఆగస్టు 4న హైదరాబాద్‌, ఆటోనగర్ లోని కర్నాటి గార్డెన్స్‌లో తెలంగాణ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులతో సదస్సును నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళిధర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు పెద్దఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పాలకవర్గాలను ఘనంగా సన్మానించి సొసైటీలకు మెమెంటోలు అందివ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు గత 13 సంవత్సరాలుగా చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని, తెలంగాణ చేనేత కార్మిక సంఘం ప్రభుత్వం పై ఒత్తిడి చేయడంతో ఎన్నికలు జరిపిందని గుర్తు చేశారు. సొసైటీలలో ఉన్న పాత అప్పులను ప్రభుత్వాలు ఇప్పటివరకు పూర్తిగా మాఫీ చేయలేదని విమర్శించారు. చేనేత సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్ రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రూ.30 కోట్లు కూడా ఉండవని, రైతులు, ఇతర వ్యాపారుల మాదిరిగానే చేనేత సంఘాల రూ.30 కోట్ల రుణాలను కూడా ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశం హాజరై సహకార సంఘాల చట్టాలపై, నిర్వహణపై సభ్యులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు సహకార సంఘాల నాయకులు, కార్మికులు అందరూ కలిసికట్టుగా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని గంజి మురళీధర్ విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్ రుణాలను మాఫీ చేయడంతో పాటు, త్రిఫ్ట్ ఫండ్ డబ్బులను వెంటనే బ్యాంకుల ద్వారా విడుదల చేయాలని కోరారు. టెస్కో ద్వారా బెస్ట్ మెటీరియల్స్, బెడ్‌షీట్లు, టవల్స్ తదితర వస్త్రాలను టెండర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని దీనివల్ల చేనేత సహకార సంఘాల సభ్యులకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిబంధనను ప్రభుత్వం విరమించుకొని హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల విద్యార్థులకు అందాల్సిన చేనేత వస్త్రాల ఆర్డర్లను వెంటనే నేరుగా చేనేత సొసైటీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆ రోజున చేనేత సంఘాల క్యాష్‌ క్రెడిట్ రుణమాఫీని ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును ప్రకటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందగట్ల గణేష్, చిట్యాల చేనేత సహకార సంఘం అధ్యక్షులు గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు, కోశాధికారి కోట రాంబాబు, డైరెక్టర్లు వడ్డేపల్లి రాములు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!