– ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష
రామన్నపేట(సంచలనం వెబ్ న్యూస్): మండల పరిధిలోని ఇంద్రపాలనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు విద్యార్ధులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చట్టపరమైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ భద్రత, బాల్య వివాహాల నివారణ, బాలల హక్కులు మరియు వివిధ చట్టపరమైన అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా మరియు ఇతర డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. బాల్య వివాహాలు బాలల విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని న్యాయమూర్తి సూచించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకొని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, గ్రామ సర్పంచ్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

